బాబు దోపిడీ జమానా

print this page

బాబు దోపిడీ జమానాతొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. తన హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని ఎలా లూటీచేసిందీ.. ప్రభుత్వ సంస్థలను తనకు, తన వారికీ ఎలా పంచుకున్నదీ, అపార సహజవనరులను దోచిపెట్టి తాను సంపదను ఎలా మూటకట్టుకున్నదీ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ సాక్ష్యాధారాలతో సహా హైకోర్టుకు వివరించారు. చంద్రబాబు తన సంస్థల ద్వారా, బినామీల ద్వారా వేల కోట్ల ఆస్తుల్ని పోగేసుకున్న తీరును, అందులో 18 ప్రధాన కుంభకోణాలను సోదాహరణంగా నివేదిస్తూ విజయమ్మ వ్యక్తిగత హోదాలో అక్టోబర్ 17న హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2,424 పేజీల ఈ రిట్ పిటిషన్‌లో 100 పేజీలు పిటిషన్ భాగం కాగా మిగతావి వివిధ ఆరోపణలను రుజువుచేసే పత్రాలే. 35 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చేటపుడు ఏమాత్రం ఆస్తుల్లేని చంద్రబాబు.. ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయాలు తప్ప మరే ఇతర వ్యాపారాలతో సంబంధం లేదని చెప్పే చంద్రబాబు.. ఇంత ఆస్తులు సంపాదించటం వెనుక ఉన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు.

చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఆస్తుల్ని తన పార్టీ వారికి, బినామీలకు పప్పుబెల్లాలు పంచినట్లు పంచేశారన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు అపార నష్టం వాటిల్లిందని.. చంద్రబాబు, ఆయన మనుషులు మాత్రమే బాగుపడ్డారని, విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారని పేర్కొన్నారు. ఈ అక్రమాలు, అవినీతిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, సెబీ తదితర దర్యాప్తు సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా బాబు అక్రమాల తాలూకు వివిధ డాక్యుమెంట్లు అందుబాటులోకి వచ్చాయని, ఇవికాక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, భూ రిజిస్ట్రేషన్ల విభాగం, ప్రభుత్వ ఉత్తర్వులు, ట్యాక్స్ విభాగాలతోపాటు వివిధ ముఖ్యమైన వర్గాల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయగలిగినట్లు విజయమ్మ పేర్కొన్నారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, డీజీపీ, సెబీలతో పాటు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు అధినేత రామోజీరావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబిలరావు అలియాస్ బిల్లీ రావు, వి.నాగరాజానాయుడు, సుజనా చౌదరి, మధుకాన్ షుగర్స్, మాగంటి మురళీమోహన్, కాకినాడ సీపోర్ట్స్ అధిపతి కర్నాటి వెంకటేశ్వరరావు, రిత్విక్ గ్రూప్ అధిపతి సి.ఎం.రమేష్‌లను చేర్చారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, మనీలాండరింగ్, ఫెమా, ల్యాండ్ గ్రాబింగ్, బినామీ లావాదేవీల చట్టం కింద వీరిపై దర్యాప్తు జరపాలని నివేదించారు. విజయమ్మ పిటిషన్‌లోని ముఖ్యాంశాలివీ...

రెండెకరాలతో మొదలెట్టి...

‘‘చంద్రబాబు ప్రస్థానం కేవలం రెండెకరాలతో మొదలైంది. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక కొంత భూమిని వెనకేసుకున్నారు. 1986లో తన కుటుంబం మొత్తానికి 70 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లో కుటుంబం విడిపోయాక తన వంతుగా వచ్చిన సొమ్ముతో నెల్లూరు జిల్లా బాలయ్యపల్లిలోని నిందాలిలో భూములు కొన్నానని 1988లో కోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో చంద్రబాబు స్వయంగా పేర్కొన్నారు. ఆ భూముల ద్వారా తనకు ఏడాదికి రూ. 36,000 ఆదాయం వచ్చేదని, తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ హైబ్రిడ్ వేరుశెనగ పండించేవాడినని ఆ అఫిడవిట్లో బాబు పేర్కొన్నారు.

కానీ వాస్తవమేంటంటే 1978లో మంత్రి పదవి చేపట్టిన నుంచీ అక్రమ మార్గాల్లో ఆస్తిని పెంచుకుంటూ పోయారు. సొంత తండ్రికే తన భూమిని తనఖా పెట్టడం, విక్రయించటం వంటి లావాదేవీలు నడిపారు. 1983లో టీడీపీలో చేరుతూనే తిరుపతిలో త్రీస్టార్ హోటల్ నిర్మించారు. తర్వాత దాన్ని టీడీపీకి చెందిన మరో నేతకు విక్రయించారు.

నిజానికి నిందాలి, వాక్యం గ్రామాల్లో తన బంధువుల నుంచే అతితక్కువ రేటుకు అంటే ఎకరా రూ.1,000 చొప్పున 1985లో తొలుత 65 ఎకరాలు కొనుగోలు చేసిన బాబు.. బినామీ పేర్లతో మరో 250 ఎకరాలు కొన్నారు. వీటి చుట్టూ 12 కి.మీ మేర ప్రహరీ నిర్మించటమే కాదు.. ప్రభుత్వ భూముల్ని, 4 పెద్ద చెరువుల్ని ఆక్రమించి మరీ తోట నిర్వహిస్తున్నారు. తెహల్కా ఈ భూముల లోగుట్టును బయటపెట్టడంతో కారుచౌక ధరలకు తన బంధువులకు విక్రయించినట్లుగా చూపించి... ఇప్పటికీ తన బినామీ తోటగా దాన్ని కొనసాగిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపితే ఈ ఆక్రమణలు, బినామీ లావాదేవీల గుట్టు బయటకొస్తుంది.

1994లో హెరిటేజ్ ఫుడ్స్ ప్రాస్పెక్టస్‌లో తాను అంతకుముందు ఏ వ్యాపారాలూ చేయలేదన్న బాబు.. భువనేశ్వరీ కార్బయిడ్స్ అండ్ కెమికల్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయిస్ కంపెనీలకు తాను ఎండీనని, వాటి పేరిట రుణాలు తీసుకున్నారన్న సంగతి దాచిపెట్టారు.

1999-2000లో ఏర్పాటు చేసిన బిజ్‌ప్రో టెక్నాలజీస్ కంపెనీ గురించి ఏ అఫిడవిట్లోనూ ప్రస్తావించలే దు. తిరుపతి హోటల్ గురించి కూడా చెప్పలేదు. దీన్నిబట్టి బాబు అఫిడవిట్లలో ఎలాంటి నిజాలు చెబుతారో అర్థం చేసుకోవచ్చు.’’


లోకేశ్‌కు అమ్మణ్ణమ్మ కోట్ల గిఫ్ట్‌లు

‘‘చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ చేసుకోవటానికి ఆఖరికి కన్న తల్లిని కూడా అక్రమాల్లో భాగం చేశారు. అమ్మణ్ణమ్మకు సొంతంగా పెద్ద ఆస్తులేమీ లేవు. ఆదాయమూ లేదు. కానీ 2000వ సంవత్సరంలో హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఆమె రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల భూమి కొన్నారు. అప్పుడే బంజారాహిల్స్‌లో రూ. 35 లక్షలు పెట్టి మరో భవనాన్ని కూడా కొన్నారు. తరవాత ఏడాది తిరక్కముందే ఆ రెండు ఆస్తులనూ చంద్రబాబు తనయుడు లోకేష్‌కు బహుమతిగా ఇచ్చేశారామె. అమ్మణ్ణమ్మకు చంద్రబాబుతో పాటు రామ్మూర్తినాయుడు కూడా కుమారుడే. మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అవన్నీ బాబు అక్రమ సంపాదనతో కొన్నవి కాబట్టే.. అంతమంది సంతానం ఉండగా ఆమె చంద్రబాబు తనయుడికే గిఫ్ట్‌గా ఇచ్చారు. అమ్మణ్ణమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన బంజారాహిల్స్ భవంతిని జె.సత్యనారాయణ అనే వ్యక్తికి లోకేష్ విక్రయించారు. మళ్లీ ఆ సత్యనారాయణ తన కుమార్తె అయిన వి.సుధాశారదకు దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. సుధాశారద వేరెవరో కాదు.. చంద్రబాబు వ్యాపార భాగస్వామి అయిన నాగరాజనాయుడి భార్యే. ఈమె మదీనాగూడలో అమ్మణ్ణమ్మ కొన్నచోటే ఐదెకరాల భూమి తొలుత కొన్నారు. తరవాత ఆ భూమిని భువనేశ్వరికి విక్రయించేశారు. ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు మదీనా గూడలో ఉన్నది పదెకరాలు. కానీ ఆయన కాంపౌండ్‌లో అంతకన్నా ఎక్కువ భూమి ఉంది.’’

బాబు లీలలు చూడు... రామా!

‘‘1989లో రామా అగ్రికల్చరల్ ఫామ్స్ పేరిట చంద్రబాబు కుటుంబం కొండాపూర్‌లో 3.276 ఎకరాలు కొనుగోలు చేసింది. భువనేశ్వరి, లోకేష్, అమ్మణ్ణమ్మ ఈ సంస్థలో భాగస్వాములు. తదనంతరం ప్రకటించిన హైటెక్ సిటీకి ఈ భూమి అర కిలోమీటరు దూరం కూడా లేదు. 1998లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను వర్తింపజేసి రూ. 25 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన బాబు.. ఆ తరవాత 2000వ సంవత్సరంలో ఈ భూమిని ఎకరా రూ.కోటి చొప్పున డాక్టర్ రెడ్డీస్ అధిపతి అంజిరెడ్డి తనయుడైన సతీష్‌రెడ్డి, ఆయన భార్య దీప్తిరెడ్డికి విక్రయించారు. నిజానికి అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఎకరా రూ. 8 లక్షలకు కొన్నారు. కానీ దానికి కొంచెం దూరంలో ఉన్న కొండాపూర్‌లో మార్కెట్ విలువ ఎకరా రూ. 12 లక్షలుండగా ఎకరా కోటి రూపాయలకు అమ్మారు. ఇది పూర్తిగా బోగస్ లావాదేవీ. తద్వారా చంద్రబాబుకు భారీ లంచం ముట్టింది. ఆ తరవాత ఈ భూమి డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో సతీష్‌రెడ్డి కుటుంబం ఒప్పందం చేసుకుంది. ఈ దివ్యశ్రీ గ్రూప్‌కు చంద్రబాబు హైటెక్ సిటీ లే అవుట్‌లో ఏకంగా ఏడెకరాల భూమి కేటాయించారు. దివ్యశ్రీ గ్రూప్‌కు భూమి కేటాయించినందుకు ప్రతిగా అది డెవలప్ చేసిన భవనంలో భారీ వాటా బాబుకు దక్కింది. దాన్ని బినామీ పేర్లతో ఉంచుకున్నందున నిజాలు బయటపడాలంటే దర్యాప్తు తప్పనిసరి.’’

ఆదాయానికి మించిన ఆస్తుల్ని ఎలా కూడబెట్టారు? 

‘‘1992లో హెరిటేజ్ ఫుడ్స్‌ను స్థాపించిన చంద్రబాబు దానిని 1994లో పబ్లిక్ ఇష్యూకు తెచ్చారు. దాని ప్రాస్పెక్టస్‌లో 1983-88 మధ్య తానెలాంటి వ్యాపారాలూ చేయలేదన్నారు. అయితే 1999లో సీఎం అయ్యాక తన ఆస్తుల్ని ప్రకటిస్తూ.. తన ఆస్తుల విలువ రూ. 7.83 కోట్లుగా చూపించారు. అంతకు పదేళ్ల కిందటే తన వార్షికాదాయం రూ. 36 వేలని చెప్పిన బాబు.. ఎమ్మెల్యేగా రూ. 650 జీతం మాత్రమే అందుకున్న బాబు.. హెరిటేజ్ ఫుడ్స్ డెరైక్టరుగా 1992 నుంచి నెలకు రూ. 20 వేలు జీతం తీసుకున్న బాబు.. కళ్లు చెదిరే రీతిలో 1999 నాటికే దాదాపు రూ.8 కోట్ల ఆస్తుల్ని ఎలా కూడబెట్టారు? తరవాత 2004, 2009 ఎన్నికల్లో డిక్లరేషన్లు సమర్పించిన ఆయన కళ్లు చెదిరే ఆస్తుల్ని చూపించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి ఇన్ని ఆస్తులు కూడబెట్టగలిగారు.

రేణిగుంట భూమి సంగతేమి?

‘‘చంద్రబాబు 1984లో తన భార్య పేరు మీద భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ కెమికల్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అలాయ్స్ సంస్థల్ని స్థాపించారు. అదే ఏడాది చంద్రబాబు భువనేశ్వరి కార్బయిడ్స్ పేరిట ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 40 లక్షల రుణం తీసుకున్నారు. తర్వాత వాయిదాలు కట్టటం మానేశారు. దీని కోసం రేణిగుంటలోని 5 ఎకరాల భూమిని తాకట్టుగా పెట్టారు. కానీ.. బాబు ఆ భూమి విషయాన్ని తన డిక్లరేషన్లలో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఈ భూమి తనకు లేదా తన భార్యకు ఎలా వచ్చిందన్న విషయాన్నీ వివరించలేదు. తదనంతర కాలంలో ఈ రుణానికి హామీగా పెట్టిన భూమి విలువ అమాంతం పెరగటంతో 2001లో తను సీఎంగా ఉండగానే ఈ రుణాన్ని వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా రూ. 11 లక్షలకు సెటిల్ చేశారు. తన భూమిని వెనక్కు తీసేసుకున్నారు. రూ. 40 లక్షల రుణానికీ.. అదీ 17 ఏళ్ల తరవాత రూ. 11 లక్షలు మాత్రమే చెల్లించటమంటే అంతకన్నా ఘోరం ఉండదు. ప్రభుత్వ సంస్థల్ని ఇలా ముంచేయటం బాబుకే చెల్లింది.’’

0 comments:

Post a comment

Related Posts Plugin for WordPress, Blogger...