సీబీఐకి అర్థం కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని రామోజీరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాడు కొంత కాలం క్రితం వరకు వ్యాఖ్యానిస్తూ వచ్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలు, ఆస్తులకు సంబంధించి సీబీఐ విచారణ ప్రారంభమైనప్పటినుంచి ఆ అభిప్రాయం మారి దాన్ని చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా భావిస్తున్నట్టుంది. కాబట్టే నాలుగు నెలల క్రితం హైకోర్టు సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ఆదేశించినది మొదలు నేటి వరకు ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనాల్లో ఏ ఒక్కటి పరిశీలించినా అందులో వార్త కనిపించదు.
రామోజీరావుకు కావలసినది ఏమిటన్నది మాత్రమే అందులో నిర్లజ్జగా బహిర్గతమవుతుంది. తెలుగు గడ్డమీద సాక్షి అనే పత్రిక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ ఉండటానికే వీల్లేదన్నది రామోజీ విధానం. ఇందుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తారని చెప్పటానికి మాత్రమే ప్రజా సమస్యలు, అధికార పక్షం వైఫల్యాలు, ప్రతిపక్షం చేతగానితనంతో నిమిత్తం లేకుండా ఈనాడు మార్కు జర్నలిజం ఉదాహరణగా నిలుస్తుంది. జగతి పబ్లికేషన్స్(సాక్షి) విలువను రూ.3,500 కోట్లుగా నిర్ణయించాల్సిందిగా డెలాయిట్ కన్సల్టింగ్ సంస్థను విజయసాయిరెడ్డి కోరారంటూ బుధవారం నాడు ఓ వర్గం మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
సీబీఐయే ఆ సంస్థకు చెందిన సుదర్శన్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలాన్ని నమోదు చేయించిందన్నది ఆ వార్త సారాంశం. ఈ వార్తను ఏ పత్రిక ఇచ్చినా, ఏ ఛానల్ ప్రసారం చేసినా అందులో తప్పు పట్టాల్సినది లేదు. అయితే రామోజీ, ఆయనతో పాటుగా జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెపితే బెంబేలెత్తిపోతున్న మీడియా పెద్దలు, రాజకీయ నాయకులు చేస్తున్నది అలాంటి జర్నలిజం కాదు. మరేమిటో చూడండి...
సుదర్శన్ మాటలు సహేతుకమేనా?
జగతి పబ్లికేషన్స్ ఆస్తుల విలువ పెంచి చూపాలని తనను విజయసాయిరెడ్డి కోరినట్టు డెలాయిట్‌కు సంబంధించిన సీనియర్ డెరైక్టర్ సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చి ఉంటే, అది ఒక వెర్షన్ మాత్రమే తప్ప న్యాయస్థానం చేసిన నిర్ధారణ కాదు. అదీగాక, అంతర్జాతీయంగా అత్యంత పేరుప్రతిష్ఠలున్న డెలాయిట్ సంస్థ, 2007లో వేల్యుయేషన్ నివేదిక ఇస్తే... 2011లో ఆ వేల్యుయేషన్ రిపోర్టును ముందు తేదీతో ఇచ్చామని చెప్పటం గానీ, వేల్యుయేషన్‌ను ఒత్తిడి చేయటం వల్ల పెంచామని అనటంగానీ సహేతుకమేనా అన్న ప్రశ్నే ఈ రాష్ట్రంలో మొత్తంగా ఎల్లో మీడియాకు నిమిత్తం లేనిదయింది.
డెలాయిట్ సంస్థ సీనియర్ డెరైక్టర్ ఇచ్చారంటున్న వాంగ్మూలంతో ఇక జగన్‌మోహన్‌రెడ్డి ‘చక్రబంధంలో’ ఇరుక్కున్నట్టేనని ఈనాడు తీర్మానించేసింది. పనిలో పనిగా... జగన్‌మోహన్‌రెడ్డిని మళ్ళీ సీబీఐ విచారించబోతోందని, రేపోమాపో ఇందుకు సంబంధించి నోటీసులు ఆయనకు ఇవ్వనున్నారని కూడా ఆ పత్రిక వెల్లడించింది.
దర్యాప్తులో ‘ఈనాడు’ పాత్రేంటి?
ఇక్కడే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ చేస్తున్న దర్యాప్తు అత్యంత రహస్యంగా సాగుతుందన్నది దేశంలో మరేకేసును చూసినా అర్థమవుతుంది. సీబీఐ అధికారులు జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారన్న అంశం సహా ‘ఈనాడు’కు మున్ముందుగా సమాచారం లభిస్తుంటే... ఇది ఎవరి కోసం జరుగుతున్న దర్యాప్తు అన్నది ప్రజలకు అనుమానాలకు అతీతంగా అర్థమవుతుంది. అదీగాక, ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా రంగం... రాజకీయానికి సంబంధించిన పరిస్థితులు ఇక్కడి ప్రజలకు వేరెవ్వరూ వివరించాల్సిన అవసరమే లేనివి.
సాక్షి పత్రిక ఆవిర్భవించినది మొదలు నేటి వరకు ఆ పత్రికను, పత్రికాధిపతిని కూల్చివేయాలన్న కుట్రపూరిత మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంముందు ఎల్లో మీడియా కుట్రలను బహిర్గతం చేయటంలో సాక్షి పోషించిన పాత్ర ఎలాంటిదో నిష్పాక్షికమైన ఏ వ్యక్తిని అడిగినా సమాధానం లభిస్తుంది. కాబట్టే చంద్రబాబుకు, ఎల్లో సిండికేట్ పత్రికలకు సాక్షి అస్తిత్వం మీదే పగ.
సాక్షిని నిలబెట్టిన వ్యక్తి అస్తిత్వం మీదే పగ. న్యాయస్థానం తీర్పు కారణంగా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలమీద ప్రారంభమైన దర్యాప్తు సంగతి ఎలా ఉన్నా, ప్రజలందరికీ ఒక్క విషయంలో స్పష్టత ఉంది. నేడు చంద్రబాబు, ఆయన మీడియా అనుచరగణాల్లో ఏ ఒక్కరి ఆర్థిక, నైతిక చరిత్ర తీసుకున్నా... వీళ్ళా నీతులు మాట్లాడేదని ముక్కున వేలు వేసుకునే పరిస్థితే కనిపిస్తుంది.
ప్రతి కథనం విషపూరితమే...
సీబీఐ దర్యాప్తును ఈనాడుగానీ, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న మరో పత్రికగానీ, మరి కొన్ని ఛానళ్ళుగానీ నివేదించటాన్ని ఇంతకు ముందు చెప్పినట్టు, ఎవ్వరూ తప్పు పట్టటం లేదు. ఇక్కడ జరుగుతున్న దర్యాప్తు ప్రజాబాహుళ్యంలో తిరుగులేని ఆదరణ పొందుతున్నాడని జాతీయ ఛానళ్ళు, పత్రికలు, సర్వే సంస్థలు కూడా నిర్ధారించిన వ్యక్తికి సంబంధించినది. ఈ దర్యాప్తు ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ మీడియాను నెలకొల్పి, అనతి కాలంలోనే దేశంలో మరే పత్రికా సాధించనంతటి పత్రికాదరణను సంపాదించిన సాక్షికి వ్యవస్థాపకుడికి సంబంధించినది. ఈ అంశాలు దర్యాప్తు జరుపుతున్న సంస్థకు కూడా సంపూర్ణంగా ఎరుకలోనివి.
పోటీ పత్రికలు సాక్షిని దెబ్బతీయటానికి, చేవలేని పార్టీలు జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయటానికి గోతి కాడ గుంట నక్కల్లా కాచుకుని కూర్చుని మూడేళ్ళుగా ఆకలి కడుపుతో ఎదురు చూస్తున్న దుర్మార్గమైన సందర్భం ఇది. విషయం అందరికీ తెలిసినదే. ఇక్కడ జరుగుతున్నది భిన్న మీడియా సంస్థలు మీడియాతో సంబంధం లేని ఒక సంఘనట గురించో పరిణామం గురించో నివేదించటం కాదు. ఇక్కడి మీడియా సంస్థల్లో ఈనాడు, ఈటీవీ, చంద్రబాబు తోక పత్రిక, ఛానళ్ళు తమ ప్రత్యర్థి మీడియాను ఈ సీబీఐ కేసులో తేలేది ఏమన్నా ఉందా... అన్న అంశంతో నిమిత్తం లేకుండా ఇప్పుడే నేలమట్టం చేయాలనుకోవటం ఏ రోజున వాటి వార్తా ప్రసారాలను చూసినా కనిపిస్తూనే ఉంది.
సీబీఐ తమతో ప్రత్యేకంగా చెప్పిందన్నట్టు... దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిమీద, ఆయన తనయుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలమీద పుంఖాను పుంఖాలుగా బెదిరించేందుకు, బ్లాక్‌మెయిల్ చేసేందుకు కావలసిన సరంజామా ప్రసారం అవుతోంది. సీబీఐ ఏం చేయబోతోంది... ఈడీ ఎందుకు పిలిచింది... రెండోసారి విచారణకు రావాలంటే అర్థం ఏమిటి... ఫలానా సాక్షిని విచారించినప్పుడు ఆ రహస్య విచారణలో ఏం జరిగింది... ఇకమీదట ఏం జరగబోతోంది... ఈ తరహాలో వార్తలు గడచిన నాలుగు నెలల్లో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి? ఏ పత్రికల్లో వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఎవరు వీటికి అసత్యాలతో కూడిన ప్రచారాలకు ముడిపదార్థాన్ని సమకూరుస్తున్నారు? తద్వారా ఏం సాధించదలచుకున్నారు?
సాక్షిని దెబ్బతీయడమే వారి ఇంటరెస్ట్
సమాధానాలూ స్పష్టం. తిరుగులేని విజయాన్ని సాధించి తెలుగువారి నిత్య జీవితంలో అంతర్భాగమైన సాక్షి మీద ఈ సంస్థ ఆవిర్భావంతో వంటిమీద దుస్తులు కోల్పోయిన పత్రికలు రాస్తున్న రాతలివి. అంటే ఇవన్నీ సాక్షి కుప్ప కూలాలని ఆశిస్తున్న ఇంటరెస్టెడ్ పార్టీలు. అంటే సాక్షిని తప్పిస్తే మళ్ళీ తమ మార్కు చీకటి జర్నలిజం యథేచ్ఛగా నడుపుకోవచ్చని, తద్వారా మళ్ళీ వందల కోట్లు మూటగట్టుకోవచ్చని ఆబగా నోరు తెరుచుకు కూర్చున్న విష సర్పాలు.
అలాగే, జగన్‌మోహన్‌రెడ్డిని... వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ఎదుర్కొని గెలవటం కల్ల అని గ్రహించి కపట ప్రచారాలతో పేరు ప్రతిష్టలను తుదముట్టించాలని కాచుకు కూర్చున్న వృద్ధ జంబూకాలు. ఇవన్నీ సీబీఐ చేయాల్సిన రహస్య విచారణ ప్రక్రియ తమ కళ్ళకు ప్రత్యక్ష ప్రసారంలో క్షణక్షణం వీక్షణం కుదురుతోందన్నట్టు వార్తలు అల్లుతున్నాయి. అంటే ఈ విచారణ తరవాత న్యాయస్థానాల అంతిమ నిర్ణయాలతో నిమిత్తం లేకుండా ఏ రోజుకు ఆరోజు సాక్షికి... జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నేరాన్ని ఆపాదించే కార్యక్రమంలో తలమునకలై ఉన్నాయి.
అంతకు మించిన విచిత్రం ఏమిటంటే... నిజాలను నిగ్గుదేల్చాల్సిన బాధ్యతలో ఉన్న దర్యాప్తు సంస్థ ఈ రాతలకు సంబంధించి ధ్రువీకరించటంగానీ, ఖండించటం గానీ చేయకుండా ప్రత్యర్థి మీడియా, ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రచారాలమీద నోరెత్తకపోవటం. తమ దర్యాప్తుకన్నా వేగంగా జగన్ ప్రత్యర్థి వర్గం రాజకీయంగా, మీడియా పరంగా వేస్తున్న నాటకాన్ని సీబీఐ తానూ ప్రేక్షకుడిగానే వీక్షిస్తుండటం. తాము న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన సాక్షికి సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచాలంటూ పత్రికలకు విజ్ఞప్తి చేసిన సీబీఐ, అలాంటి ఏ హక్కులూ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన సంస్థలకు ఉన్నాయని భావించకపోవటం కూడా ఈ మొత్తం అంకంలో ప్రజల కంట పడుతూనే ఉంది. ఇలాంటి సంఘటనలు చూసిన తరవాతే, జరుగుతున్నది దర్యాప్తా... లేక కక్ష సాధింపా అన్న అనుమానాలు బలపడితీరతాయి.
రామోజీకి ఏ చట్టమూ వర్తించదా?
విశేషం ఏమిటంటే... జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి నిత్యం తన పత్రికలో గగ్గోలు పెట్టే రామోజీరావుకు సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 2,000 ఎకరాల భూమి ఉంది. ఈ పెద్దమనిషి ఈ వాస్తవంతో నిమిత్తం లేకుండా భూ గరిష్ట పరిమితి చట్టాలు పేదలకు మేలు చేయటం లేదని సంపాదకీయాల్లో కుమ్మేయగలరు. తన సంస్థను అమ్మకానికి పెట్టి దాని విలువను రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు నిర్ణయించిన రామోజీ రూ.100 విలువైన తన సంస్థ షేరుమీద రూ.5,28,630 ప్రీమియం వసూలు చేసి... కేవలం రూ.3,500 కోట్ల వాల్యుయేషన్‌తో రూ.350 ప్రీమియంతో సాక్షి షేర్లు అమ్మటాన్ని తప్పు పట్టి నెలల తరబడి జనాన్ని వదిలి జగన్ వ్యతిరేక భజనలో మునిగి తేలగలరు.
ఇంతకీ సీబీఐ దర్యాప్తు, సెబీ విచారణ, మనీ లాండరింగ్ చట్టం కింద శిక్ష పడాల్సినది ఎవరికి? ఎక్కడో ఉన్న కంపానీయో, అంబానీయో ఇక్కడ రామోజీ కష్ట సమయంలో వేలకువేల కోట్లు ఆరగించండి అంటూ రామోజీ పట్టుకున్న హారతి పళ్ళెంలో ఎందుకు సమర్పించుకున్నారు? అలాగే, ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడికి మనిషన్నవాడు చేయకూడని సహాయాలేవో చేశాడని పేరున్న ఓ పాత్రికేయుడు.... అప్పటికే నష్టాల్లో ఉండి మూతపడిన సంస్థను కొనుగోలు చేసి, అందులో పెట్టుబడులు పెట్టినవారిని తరవాత ఎలా బయటకు వెళ్ళగొట్టాడు? నిజమైన దర్యాప్తుల్లో నిగ్గుదేలాల్సిన అంశాలివి.
పోటీ పత్రిక వస్తే కుమ్మక్కవుతారా?
జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలు, ఆస్తులకు సంబంధించిన దర్యాప్తు సందర్భంగా ప్రజలందరిముందు మరోసారి బహిర్గత మవుతున్న అంశం ఏమిటంటే... ఈ రాష్ట్రంలో ప్రజలముందు ప్రత్యామ్నాయంగా మరో పత్రికగానీ, రాజకీయ పార్టీగానీ ఆవిర్భవించి నిలదొక్కుకుంటే ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన కొందరు పెద్దల గుట్టుమట్లు రట్టవుతున్నాయి. కొందరి మీడియా ప్రయోజనాలు కొత్త పత్రికను ప్రజలు ఆదరించిన కారణంగా దెబ్బతింటున్నాయి. కాబట్టే మూకుమ్మడిగా ఒక మనిషిమీద, ఆయన ఆధ్వర్యంలో ఆవిర్భవించిన మీడియా సంస్థలమీద సీబీఐ దర్యాప్తును అడ్డం పెట్టుకుని అసత్యాలను ప్రజల మెదళ్ళలో కూరే దాడులు జరుగుతున్నాయి.
భయోత్పాతం సృష్టించడమే వారి లక్ష్యం...
పెట్టుబడి దారుల్ని బెంబేలెత్తించటం... ఇక అరెస్టులు జరుగుతాయని ప్రచారం చేయటం... ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత అవినీతి పరుడని చెప్పటం... జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలకు వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పినా అది నిజమేనని నమ్మించటం... ఇవన్నీ చూస్తున్న తెలుగు ప్రజలకు 2009 సెప్టెంబరు 2న వైఎస్ హఠాన్మరణం తరవాతి దృశ్యాలు గుర్తుకు రాక మానవు. ఓదార్పు యాత్రను మానుకోనని ప్రకటించినందుకు జగన్‌మోహన్‌రెడ్డిని ఇక పార్టీ నుంచి గెంటి వేయబోతున్నారంటూ నిత్యం... ఇదే ఈనాడు, ఇవే ఎల్లో మీడియా పత్రికలు-ఛానళ్ళు చేసిన ప్రచారం ఎట్టకేలకు వాటి వ్యూహాలన్నింటినీ చిత్తు చేసింది.
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడితే ఒడ్డున పడిన చేప అనుకుంటే... జన సముద్రం తరలి వచ్చి జగన్‌ను అక్కున చేర్చుకుంది. ఆ తరవాత ఎల్లో మీడియా ఏకమై చేసిన ప్రచారాలకు కడప ఓటరు అదే జగన్‌కు నేటి పార్లమెంటులో ఏ ఎంపీకీ లేని మెజారిటీతోపాటు మహానేత సతీమణికి పులివెందుల చరిత్ర తిరగరాసి పట్టం కట్టి పంపాడు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తును తమ అజెండాకు అనుగుణంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వర్గాలన్నీ ప్రజాస్వామ్యం ఏం చెబుతోందో తలకెక్కటం లేదు. మీడియా పాత్ర కూడా మెదడుకు చేరటం లేదు.
0 comments:
Post a Comment