విచారణ నిలిపేయాలని కోరితే.. కేసునే కొట్టేసిన హైకోర్టు

print this page
జస్టిస్ రోహిణి ధర్మాసనం ఆదేశాలపై నిపుణుల ఆశ్చర్యం
బాబుపై నవంబర్ 14న సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు 
దాన్ని నిలిపేయాలంటూ ‘సుప్రీం’కు వెళ్లిన బాబు సన్నిహితులు 
హైకోర్టునే ఆశ్రయించాలని వారికి చెప్పిన సుప్రీంకోర్టు 
హైకోర్టులో తన సన్నిహితులతో జత కలిసిన చంద్రబాబు 
విచారణ నిలిపేయాలని, ఉత్తర్వులు రద్దు చేయాలని వినతి 
కానీ ఏకంగా విజయమ్మ పిటిషన్‌నే కొట్టివేసిన జస్టిస్ రోహిణి బెంచ్ 
ముందటి బెంచ్ ఇచ్చిన తీర్పుపైనా ఈ బెంచ్ వ్యాఖ్యలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘మా వాదన వినకుండానే హైకోర్టు మాపై విచారణకు ఆదేశించింది. అందుకని ఆ విచారణను నిలిపేయండి. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయండి’’ - ఇదీ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు బినామీలైన సుజనాచౌదరి, రామోజీరావు, సి.ఎం.రమేష్, నామా నాగ్వేరరావు తదితరులు సుప్రీంకోర్టులో చేసిన వాదన. అలా రద్దు చేయటానికి ససేమిరా అన్న సుప్రీంకోర్టు.. కావాలంటే వెళ్లి హైకోర్టును ఈ రకమైన ఉపశమనం అడగవచ్చని సూచించింది. హైకోర్టుకు వచ్చిన తన బినామీలకు చంద్రబాబు కూడా జత కలిశారు. నిజానికి హైకోర్టును ఆశ్రయించవచ్చునని చంద్రబాబుకు సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లనే లేదు. కానీ చిత్రంగా హైకోర్టుకు వచ్చేసరికి బాబు కూడా పిటిషన్ వేశారు. ఇక్కడ కూడా బాబు అండ్ కో అడిగింది ఒక్కటే. ‘‘నవంబర్ 14న హైకోర్టుకు మాపై ఆదేశించిన సీబీఐ విచారణను నిలిపేయండి. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయండి’’ అని. 

కానీ చిత్రమేంటంటే ఈ వాదనలను విన్న జస్టిస్ రోహిణి నేతత్వంలోని ధర్మాసనం.. గురువారం నాడు 56 పేజీల తీర్పును వెలువరిస్తూ ఈ విచారణను నిలిపేయటమే కాక.. తొలుత హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయటమే కాక.. ఏకంగా చంద్రబాబుపై వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం మొత్తాన్నే కొట్టేసింది. ‘‘అసలు బాబు తదితరులు వేసిన పిటిషన్లన్నీ విచారణను నిలుపు చేయాలని. లేదంటే విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని. కానీ జడ్జి ఏకంగా పిటిషన్‌నే ఇది ప్రజాహిత వ్యాజ్యంగా పనికిరాదంటూ కొట్టేయటం చాలా ఆశ్యర్యం కలిగించింది’’ అంటూ న్యాయ నిపుణులే విస్తుపోతుండటం గమనార్హం. 

‘నాట్ బిఫోర్’తో మారిన బెంచ్... 

నిజానికి జస్టిస్ గులాంమహ్మద్ నేతత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరినపుడు సహజంగా అయితే ఆ పిటిషన్ కూడా అదే బెంచ్‌కు వెళ్లాలి. బెంచ్ తన తీర్పును తను సమీక్షించుకోవటమో, లేక దానికే నిలబడటమో చేస్తుందన్నది న్యాయ నిపుణుల మాట. కాకపోతే బాబు అండ్ కో వేసిన పిటిషన్లు ‘నాట్ బిఫోర్’ న్యాయవాదుల కారణంగా హైకోర్టులోని వివిధ బెంచ్‌లను దాటి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనానికి చేరాయి. ‘‘జస్టిస్ రోహిణి బెంచ్ అంతకు ముందటి బెంచ్‌కన్నా సుపీరియర్ బెంచ్ ఏమీ కాదు. అలాంటిది అంతకుముందు బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఈ బెంచ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. 

పిటిషనర్ అడిగినదానికన్నా ఆ బెంచ్ ఎక్కువ ఇచ్చిందంటూ వ్యాఖ్యానించటం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది’’ అంటూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు కొందరు పేర్కొన్నారు. నిజానికి చంద్రబాబు అండ్ కో వేసిన పిటిషన్లలో ఎక్కడా వారు ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరలేదు. ఈ విషయాన్ని గుర్తు చేసిన కొందరు న్యాయవాదులు ‘‘న్యాయమూర్తి ఒకరకంగా తనను కోరని అంశానికి స్పందించారనే అనుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. 

వారి వాదనలకు అవకాశమివ్వాలి కానీ... 

అసలు సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు గానీ, తిరిగి హైకోర్టుకు వచ్చినపుడుగానీ చంద్రబాబు, ఆయన బినామీలు వాదించింది ఒక్కటే. కోర్టు తమను విచారించకుండానే ఉత్తర్వులు ఇచ్చేసిందని. అది తమ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని. జస్టిస్ రోహిణి తన తీర్పులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో వారికి అన్యాయం జరిగిందని గనక కోర్టు భావిస్తే అందుకు తగ్గట్లుగా స్పందించాలి. వారి వాదనను వినలేదంటున్నారు కనక పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి, పిటిషనర్ ఆరోపణలకు వారేమని సమాధానమిచ్చారో కూడా వినాలి. ఇరుపక్షాల వాదనలూ పూర్తిగా విన్నాక తన తీర్పును ప్రకటించాలి. కానీ పిటిషనర్ చేసిన ఆరోపణల జోలికి వెళ్లకుండా.. ఆ పిటిషన్ అసలు ప్రజాహిత వ్యాజ్యానికి అర్హమైనది కాదని కొట్టేయటమే మమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది’’ అని ఉన్నత స్థాయి న్యాయ వర్గాలు పేర్కొనటం గమనార్హం. 

ఆ బెంచే ఎక్కువిచ్చింది! 

జస్టిస్ రోహిణి తన తీర్పులో ఏమన్నారంటే.. ‘‘నవంబర్ 14న ఇచ్చిన తీర్పును ఒకరకంగా పిటిషనర్ వై.ఎస్.విజమయ్మ అడిగినదానికన్నా ఎక్కువ ఇచ్చినట్లే భావించాలి. ఎందుకంటే పిటిషనర్ తన పిటిషన్లో.. చంద్రబాబు తదితరులపై సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల చేత ప్రాథమిక విచారణకు ఆదేశించాలని కోరారు. కానీ కోర్టు సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, రాష్ట్ర పోలీసులతో కూడా విచారణ/దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు స్పష్టంచేసింది. దీనివల్ల చంద్రబాబు తదితరుల ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. 

కేసులోని అంశాల జోలికెళ్లలేదు: ‘‘ఇక్కడొక విషయం గమనించాలి. చంద్రబాబునాయుడు, తదితరుల తరఫున వాదించిన న్యాయవాదులెవరూ కేసులోని అంశాలు నిజమైనవా? కావా? అనే దాని జోలికి వెళ్లలేదు. మేం కూడా పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ సరైనవా? కాదా? అనే అంశం జోలికి వెళ్లటం లేదు. ఈ రిట్ పిటిషన్‌ను ఒక ప్రజాహిత వ్యాజ్యంగా విచారించవచ్చా? విచారించకూడదా? అన్న ఒక్క విషయానికే మేం పరిమితమయ్యాం’’ అని జస్టిస్ రోహిణి తన తీర్పులో పేర్కొన్నారు. అన్నిటికన్నా విచిత్రమేంటంటే.. జస్టిస్ రోహిణి బెంచ్ ఇచ్చిన తీర్పు చూపిస్తూ కోర్టు తనకు క్లీన్‌చిట్ ఇచ్చేసినట్లు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించటం. తనపై ఆరోపణలన్నింటినీ విచారించేసి, సదరు ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చినట్లుగా చెలరేగిపోతుండటం. 

అసలు ఏ ఒక్క ఆరోపణ జోలికీ వెళ్లలేదని కోర్టు అంత స్పష్టంగా చెప్పినా.. బాబు మాత్రం తనకే క్లీన్ చిట్ వచ్చిందంటూ, 32 ఏళ్ల తన రాజకీయం తెరిచిన పుస్తకమంటూ ఇలా నోటికొచ్చిన మాటలన్నీ చెప్పేశారు. పార్టీ నాయకులు తినిపించిన స్వీట్లన్నిటినీ తింటూ విపరీతంగా ఆనందపడ్డారు. ఎందుకని ఇంత సంతోషం? నిజంగా విచారణ జరిగి, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తు చేసి.. చంద్రబాబు తప్పేమీ లేదని, ఆయన ఏ నేరమూ చేయలేదని చెప్పలేదు కదా? మరి క్లీన్‌చిట్ వచ్చిందంటూ ఎందుకింత గోబెల్స్ ప్రచారం? ఇంకా చిత్రమైన అంశమేంటంటే.. ఆరోపణలపై సమాధానం చెప్పే హక్కును చంద్రబాబు తదితరులు ఉపయోగించుకోలేదని, తరవాత ఉపయోగించుకోవటానికి వీలుగా రిజర్వులో ఉంచుకున్నారని కూడా జస్టిస్ రోహిణి తన తీర్పులో ప్రస్తావించారు. అంటే విచారణ జరిగిన పక్షంలో బాబు అండ్ కో ఆ విచారణకు సమాధానమిస్తూ.. పిటిషన్లో తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా అఫిడవిట్లు వేస్తారన్న మాట. కాకపోతే కేసును కొట్టేయటంతో ఆ అఫిడవిట్లు వేసే అవకాశం వారికి రాలేదు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...