వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ కుట్రబుద్ధితో ప్రచారం

print this page
తమ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కలిసి కుట్రబుద్ధితో ప్రచారం చేస్తున్నాయనీ అసలు ఆయన అరెస్టుకు గల కారణాలేమిటో ఈ రెండు పార్టీలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, మేకా శేషుబాబు మంగళవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో కోవూరు ఉప ఎన్నిక సమయంలో అరెస్టు చేస్తారని కొన్ని సార్లు, లేదా, మిగతా ఉపఎన్నికల సమయంలో ఆ పని చేస్తారంటూ ఆ పార్టీల నేతలు క్రమం తప్పకుండా దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు జగన్‌ను అరెస్టు చేస్తారనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలేమిటో వెల్లడించాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ‘జగన్‌ను అరెస్టు చేస్తామని సీబీఐ మీకేమైనా చెప్పిందా...కాంగ్రెస్ వారికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారా, లేక టీడీపీ వారికి వారి అధినేత చంద్రబాబునాయుడు చెప్పారా...?’ అని వారు నిలదీశారు. 

జగన్ అరెస్టు జరుగుతుందంటూ కాంగ్రెస్‌లో ఒక వ్యూహం ప్రకారం ప్రచారం చేయించడం, చంద్రబాబు స్వయంగా పలు సమావేశాల్లో ఇదే విషయాన్ని చెప్పడం చూస్తూంటే సీబీఐ అధికారులే వీరికి చెప్పారా! అనే అనుమానం కలుగుతోందన్నారు. అసలు సీబీఐకి, ఇలా దుష్ర్పచారం చేస్తున్నవారికీ ఉన్న సంబంధం ఏమిటని కూడా వారన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ కలిసికట్టుగా ఈ డ్రామా ఆడుతున్నాయని వారు విమర్శించారు. ‘అసలు జగన్‌కు ఏం సంబంధం ఉందని అరెస్టు చేస్తారు? ఆయన ఏనాడైనా సచివాలయంలో అడుగు పెట్టలేదు, ఒకటీ రెండు సార్లు అనివార్యమైన సందర్బాల్లో తప్ప జగన్ ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయంలో కూడా అడుగుపెట్టలేదు...పోనీ అధికారులెవరికైనా ఫోన్లు చేశారా? ’ చెప్పాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. 

వాస్తవానికి ఆ రోజుల్లో జగన్ హైదరాబాద్‌కు రావడమే అరుదుగా జరిగేదని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ఈ దుష్ర్పచారం చూస్తూంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర ఇందులో ఉందనిపిస్తోందనీ అయితే తమ పార్టీ కార్యకర్తలు ఇలాంటి ప్రచారానికి రవ్వంత కూడా భయపడరనీ ద్విగుణీకృత ఉత్సాహంతో తిప్పి కొడతారనీ వారు హెచ్చరించారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...