‘‘చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంపై సదస్సులు నిర్వహించినప్పటికీ, ఆయన యూరప్, అమెరికాల్లో అధికారిక పర్యటనలు జరిపినప్పటికీ.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి చెప్పుకోదగిన విదేశీ పెట్టుబడులు రాలేదు. అయితే విచిత్రంగా కాకినాడ సీ పోర్టు మొదలు ఎమ్మార్ టౌన్ షిప్ వరకు దాదాపు అన్ని కాంట్రాక్టులూ మలేసియా, సింగపూర్, అరబ్ దేశాలకే దక్కాయి.
కాకినాడ సీ పోర్టు కాంట్రాక్టు దక్కించుకున్న ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ కన్సార్షియం చైర్మన్, అందులో అగ్రవాటాదారు అయిన మీర్జాన్ బిన్ మహతిర్.. చంద్రబాబుకు సన్నిహితుడైన మలేసియా మాజీ ప్రధాని కుమారుడు. మలేసియా, సింగపూర్‌లలోని ఆతిథ్య రంగంలో చంద్రబాబుకు పెట్టుబడులు ఉన్నాయంటూ తెహల్కా తదితర పత్రికలు బయటపెట్టాయి. ఇలాంటి కేసుల్లో లంచాలను స్వదేశంలో కాకుండా విదేశాల్లో తీసుకుని అక్కడే పెట్టుబడులు పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. బాబు హయాంలో రాష్ట్రంలో పనులు చేపట్టడానికి వచ్చిన ఐజేఎం కార్పొరేషన్, ఐఓఐ ప్రాజెక్ట్స్, జురాంగ్ ప్రాజెక్ట్స్ వంటివన్నీ నిధుల్ని మారిషస్ మార్గంలోనే తెచ్చుకున్నాయి.
వాటి భారతీయ ప్రతినిధులు మాత్రం టీడీపీకి సన్నిహితులు కావడం గమనార్హం. ఐజేఎం రామలింగరాజు కుటుంబీకులది కాగా, ఐఓఐ ఇండియా చుక్కపల్లి సురేశ్‌ది. ఆయన సోదరుడు రమేష్ 2009 ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సురేశ్ కంపెనీకి బంజారాహిల్స్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని బాబు హయాంలో చౌకగా ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ కోసం కట్టబెట్టారు. ఈ కంపెనీకి నిధులు ఐఓఐ మారిషస్ నుంచి వచ్చాయి. ఆ ఐఓఐ మారిషస్‌కు బాబే యజమాని. ఇవన్నీ మనీ లాండరింగ్ మార్గాలే. 2001లోనే చంద్రబాబుకు సింగపూర్‌లో హోటల్ ఉన్నట్లు తెహల్కా డాట్ కామ్ వెల్లడించింది. ఆ హోటల్ పేరు ‘పార్క్ హోటల్ క్లార్క్ క్వే’ అని తెలిసింది. దాన్లో 100 శాతం వాటా ఉన్నది ‘ఈగిల్ ఫోర్స్ ప్రాఫిట్స్ లిమిటెడ్’ అనే కంపెనీకని, దాన్ని ఏర్పాటు చేసింది లాండరింగ్ మనీకి కేంద్రం లాంటి బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లోనని తెలిసింది. ఈ కంపెనీ అసలు లబ్ధిదారు బాబేనన్న ఆరోపణలో నిజాలు ఈడీ విచారణలో మాత్రమే నిగ్గు తేలగలవు.’’
హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీకి పాతరేశారు
‘‘చిత్తూరు ప్రభుత్వ సహకార డెయిరీని చంద్రబాబు తన హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ కోసం నాశనం చేశారు. ఈ విషయంలో బాబు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందీ పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. దీనికి సంబంధించి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఒక కేస్ స్టడీ నివేదికను కూడా ప్రచురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మూడు వారాలకే.. తన హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీకి అమ్మకం పన్ను 14 సంవత్సరాల వాయిదా రాయితీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు, అమ్మకం పన్ను రాయితీల ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 1996 - 2004 మధ్య కాలంలో రూ. 15.23 కోట్ల మేర ప్రయోజనం పొందింది.’’
కాకినాడ పోర్టును కాజేశారు
‘‘కాకినాడ సీ పోర్టును ప్రయివేటీకరించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ పరిశీలించి కొన్ని సూచనలు చేసింది. కానీ.. ఈ పోర్టును నాటి మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడు మిర్జాన్ బిన్ మహతిర్ నేతృత్వంలోని కన్సార్షియానికి అప్పగించటానికి.. రైట్స్ సూచనలకు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీళ్లొదిలారు.
రైట్స్ నివేదికలో అసలు మహతిర్ కన్సార్షియం ఊసే లేకపోవటంతో.. ఆ నివేదికను పూర్తిగా మార్చివేశారు. టీడీపీ మాజీ మంత్రి పద్మావతి కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఈ కన్సార్షియానికే పోర్టును అప్పగించారు. ప్రయివేటు డెవలపర్లకు ప్రయోజనం చేకూర్చేలా కాంట్రాక్టు నియమ నిబంధనలను పలుమార్లు మార్చారు. ఫలితంగా ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాంట్రాక్టు ప్రకారం కన్సార్షియం ప్రతి ఏటా మినిమం గ్యారంటీ అమౌంట్ (కనీస మొత్తం) చెల్లించాల్సి ఉంది. మహతిర్ కన్సార్షియం తొలి రోజు నుంచీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీనిని ‘కాగ్’ తప్పుపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో ఎన్నో మారిషస్ కంపెనీలు కీలకపాత్ర పోషిం చాయి. తప్పుడు సమాచారమిచ్చిన ‘ఎవర్‌లింక్ ఏసియా ఇన్వెస్ట్‌మెంట్స్’ వంటి కంపెనీల షేర్లు ఆ తరవాత ఎల్ అండ్ టీ చేతిలోకి వచ్చేశాయి. దీని అసలు లబ్ధిదారు చంద్రబాబే. అసలు పోర్టు రంగంతో ఏమాత్రం సంబంధం లేని బోళ్ల బుల్లిరామయ్యకు చెందిన ‘సౌతిండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ’కి వాటాలు కేటాయించారు. బుల్లిరామయ్య 1999-2004 మధ్య ఏలూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు. అంతేకాదు.. ఆయన చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్స్‌కు సారథ్యం వహిస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావు కూడా బాబు వివాదాస్పద లావాదేవీలకు ప్రతినిధే. సింగపూర్, మలేసియా, మారిషస్‌లలో వివిధ పేర్లతో నెలకొల్పిన కంపెనీల్లో చంద్రబాబు ప్రయోజనాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.’’
|
0 comments:
Post a Comment