టీడీపీలో గందరగోళం ఈనాడు పత్రికకు కనిపించదా

print this page
జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఈ విషప్రచారం
ప్రజలను మోసగించే వార్తలకు రామోజీరావు ఇకనైనా స్వస్తి పలకాలి


కర్నూలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలను వండివారుస్తోందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో గందరగోళమని, జగన్ జైలుకు వెళ్తారని రోజుకో అబద్ధపు వార్త రాస్తోందని నిప్పులు చెరిగారు. ఎవరి ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారని రామోజీరావును నిలదీశారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పేందుకు 18 మంది ఎమ్మెల్యేలం ఎప్పుడూ చేతిలో చేయి వేసుకుని రామోజీ ముందు కనిపించాలా అని ప్రశ్నించారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ, దానికి వంత పాడుతున్న ఎల్లోమీడియా తీరును ఎండగట్టారు. 

‘‘మేము 18 మంది ఎమ్మెల్యేలం డిస్‌క్వాలిఫై అవుతామని తెలిసి కూడా జగన్ మాట మీద నిలబడి అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతిచ్చాం. మమ్మల్ని ఒకేసారి డిస్‌క్వాలిఫై చేయాలని కోరుతూ మూకుమ్మడిగా స్పీకర్‌ను కలిశాం. బహుశా ఇలా జరగడం దేశ చరిత్రలోనే మొదటిసారి. చివరికి అసెంబ్లీకి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని వెళ్లాం. ఇవేవీ రామోజీరావుకు కనిపించవా? ఇవేవీ కనిపించకపోతే.. పోనీ మేమంతా జగన్ వెంటే ఉన్నామని చెప్పేందుకు ఏం చేయాలో మీరే చెప్పండి. ప్రజలను మోసగించేలా తప్పుడు వార్తలు రాసే విధానానికి రామోజీరావు ఇకనైనా స్వస్తి పలకాలి’’ అని హితవు పలికారు. సీబీఐ ఈ ఎల్లో మీడియాతో కుమ్మక్కై సమాచారాన్ని లీకు చేస్తూ జగన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తోందని ఆరోపించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో జగన్ జైలుకు వెళ్తారంటూ తప్పుడు రాతలు రాస్తున్నా వాటిని సీబీఐ ఎందుకు ఖండించడం లేదన్నారు. ఈ తప్పుడు కథనాలపై కోర్టుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

టీడీపీలో గందరగోళం కనిపించదా..?

వైఎస్సార్ కాంగ్రెస్‌పై, జగన్‌పై దుష్ర్పచారం చేసే ఈనాడుకు.. టీడీపీలో గందరగోళం ఏదీ కనిపించదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఇటీవల నిర్వహించిన టీడీఎల్పీ సమావేశానికి 90 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశాన్నే రద్దు చేశారు. మరి ఇలాంటి వార్తలు ఈనాడులో ఎందుకు రాయడం లేదు? అంతేకాకుండా ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చంద్రబాబునాయుడును ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. వాటికి సంబంధించిన వార్తలు ఎందుకు రావు. ఆ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు తెలంగాణకు మద్దతంటారు. మరో సగం మంది వ్యతిరేకిస్తారు.. టీడీపీలో ఈ గందరగోళం ఆ పత్రికకు కనిపించవా?’’ అని ప్రశ్నించారు. 

జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితి లేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వింటేనే రామోజీరావు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. నిత్యం జనంలో ఉంటూ సమస్యలపై పోరాడుతూ.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్న జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విష ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ తప్పుడు రాతల వల్ల లబ్ధి పొందాలను కోవడం సరికాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఇక అధికారం తమదేనని టీడీపీ నాయకులు ఊహల్లో తేలిపోయారని, అయితే జగన్‌కు రోజురోజుకూ ప్రజాదరణ పెరిగిపోతుండటంతో అధికారంలోకి రావడం కష్టమని భావించిన టీడీపీ నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు.

ఒకప్పుడు చెల్లింది.. ఇప్పుడు కాదు..

కడప పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో ఆరింట్లో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుందని ఎల్లో రాతలు రాశారని.. అయితే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి డిపాజిట్లు కోల్పోయిన సంగతిని ప్రజలు మరచిపోలేదని శోభా నాగిరెడ్డి అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తోందంటూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వచ్చాయన్నారు. 

అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోగా.. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని టీడీపీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు. ‘‘ఈనాడు చెప్పిందే వేదం అన్నట్లుగా ఒకప్పుడు చెల్లింది. కానీ ఇప్పుడు కాదు. నాడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించి చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేందుకు ఈనాడు కీలక పాత్ర పోషించింది. ఆ పత్రిక కుట్ర పూరిత వార్తలు రాసినందుకు రామోజీరావుపై ఎన్టీ రామారావు అప్పట్లో కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఒక పత్రికను అడ్డుపెట్టుకుని నామీద ఇంత కుట్ర పన్నారు.. నేను హైదరాబాద్ వెళ్లి రామోజీ సంగతి తేలుస్తా..’ అన్నారు’’ అని నాటి ఘటనను గుర్తుచేశారు. జగన్‌ను జైల్లో పెడితే లాభపడాలనే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 

జగన్ చేస్తున్న దీక్షలు, పోరాటాలు ప్రజల్లో నాటుకొని పోయాయని.. ఆయన్ను ఏ శక్తీ ఆపలేదన్నారు. పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ... చంద్రబాబు నాయుడిపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు హడావుడి చేస్తూ... చంద్రబాబుకు హైకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు క్రియేట్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోనే స్వీట్లు పంచుకోవడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. తాను రాజీనామా చేసినా అసెంబ్లీకి హాజరవుతున్నట్లు ఈనాడు పత్రికలో రాయడాన్ని ఖండించారు. రైతు సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చే సేందుకే అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో శోభా నాగిరెడ్డితోపాటు ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...