ఏది ‘సత్యం’..?

print this page


ఏది ‘సత్యం’..?




మన రాష్ట్రంలో ఓ చింతలపాటి శ్రీనివాస రాజు అలియాస్ శ్రీనిరాజు. టీవీ9 వ్యవస్థాపకుడు. ఇప్పటికీ ఆ కంపెనీలో అత్యధిక వాటాలున్న యజమాని. ఈయన సత్యం రామలింగరాజుకు తోడల్లుడు కూడా. ఈ శ్రీని, తొలినాళ్లలో విదేశాల్లో ఓ చిన్న ఉద్యోగి. 1992లో రామలింగరాజు పిలుపునందుకుని ఇండియా వచ్చేశారని చెబుతారు. ఆ తరవాత సత్యంకు చెందిన వివిధ అనుబంధ సంస్థల్లో పలురకాల పదవులు నిర్వహిస్తూ వచ్చారు. సత్యం ఇన్ఫోవే, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అన్నీ వీటిలో భాగమే. శ్రీని రాజు తరవాత సత్యం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఎస్‌ఈఎస్‌ఎల్)కు సీఈఓగా వ్యవహరించేవారు.

అయితే 1999లో సత్యం కంప్యూటర్స్ తనకు మెజారిటీ వాటాలున్న సత్యం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, సత్యం రినెజైన్స్ కన్సల్టింగ్ లిమిటెడ్, సత్యం స్పార్క్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లను తనలో విలీనం చేసుకుంది. తాను కేవలం వై2కే కంపెనీగా మిగిలిపోకుండా ప్రొడక్ట్స్ పరిధిని విస్తరించుకోవటానికే ఇలా చేసినట్లు సత్యం అప్పట్లో ప్రకటించింది. టెలికాం, ఈఆర్‌పీ రంగాల్లో విశేష అనుభవమున్న ఎస్‌ఈఎస్‌ఎల్ విలీనాన్ని అంతా హర్షించినా... ఆ విలీనానికి ముందు జరిగిన తతంగమే దీన్లోని కుంభకోణం యావత్తునూ బయటపెట్టింది.

ఈ కంపెనీకి అంత ‘శీన్’ లేదు!

నిజానికి ఎస్‌ఈఎస్‌ఎస్‌లో సత్యం కంప్యూటర్స్‌కు 96.77 శాతం వాటా ఉండేది. కానీ ఈ విలీనానికి కొంచెం ముందు... 12 లక్షల రైట్స్‌ను ఎస్‌ఈఎస్‌ఎల్ జారీ చేసింది. దీనివల్ల కంపెనీ ఈక్విటీ రూ.31 కోట్ల నుంచి రూ.42 కోట్లకు పెరిగింది. అయితే ఈ రైట్స్‌లో 4 లక్షల రైట్స్‌ను మాత్రమే విలీనం సమయంలో సత్యం కొనుగోలు చేసింది. దాంతో 8 లక్షల రైట్స్ ఎస్‌ఈఎస్‌ఎల్ అధిపతి శ్రీని రాజు పేరిటే ఉండిపోయాయి. విలీనం సమయంలో... ఆ 8 లక్షల రైట్స్‌కు గాను సత్యం కంప్యూటర్ షేర్లను ఒక రైట్‌కు ఒక షేరు చొప్పున రూ.10 ధరకే కేటాయిస్తున్నట్లు సత్యం ప్రకటించింది. నిజానికి అప్పట్లో స్టాక్ మార్కెట్లో సత్యం షేరు ఒక్కోటీ రూ.1,900 పైనే పలుకుతోంది. అలాంటి షేరును రూ.10కే కేటాయించటంతో అప్పటి రేటు ప్రకారమే ఉన్నపళంగా రూ.151 కోట్లు శ్రీని రాజు ఒళ్లో వచ్చి వాలినట్లయింది.

ఈ తతంగం అటు వాటాదారులకుగానీ, ఇటు విదేశీ ఇన్వెస్టర్లకుగానీ ఏమాత్రం నచ్చలేదు. వారు సత్యం అధికారుల్ని నిలదీశారు.

అప్పట్లో రామలింగరాజు విదేశాల్లో ఉండటంతో రామ్ మైనంపాటి వంటి సీనియర్ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. అంతా పారదర్శకంగానే జరిగిందన్నారు తప్ప వివరాలేమీ వెల్లడించలేకపోయారు. విదేశీ మదుపరులు, స్థానిక ఇన్వెస్టర్లు ఈ మోసాన్ని భరించలేకపోయారు. షేరును వదిలించుకోవాలనుకున్నారు. అమ్మకాలు జరిపారు. ఆ రోజు ఒక్కరోజే ఒక దశలో షేరు 15 శాతానికి పైగా నష్టపోయింది. అయితే సత్యం క్రైసిస్ మేనేజర్లు రంగంలోకి దిగారు. యాజమాన్యం వివరణతో అంతా సర్దుకున్నట్లేనన్న భావన కలిగించడానికి ఆ షేరును మళ్లీ పైకి తీసుకెళ్లారు. కృత్రిమంగా షేర్ విలువను పెంచారు. వివాదం తలెత్తిన రోజున రూ.1700 ఉన్న షేరు రెండు రోజులు గడిచేసరికల్లా రూ.2,500కు చేరిందంటే పరిస్థితిని ఏ రకంగా మేనేజ్ చేశారో తెలియకమానదు. శ్రీని రాజుకు లబ్ధి చేకూర్చడానికి... అది మోసమని గ్రహించిన ఇన్వెస్టర్లను సమాధానపర్చడానికి ఇంత తతంగం నడిపారన్నది ఏ కొంచెం అవగాహన ఉన్నవారికైనా ఇట్టే అర్థమవుతుంది.

మంది సొమ్ము శ్రీనార్పణం!

ఇలా సత్యం సంస్థలో శ్రీని రాజు ప్రవేశమే ఓ మోసమనుకుంటే... కంపెనీలోంచి ఆయన బయటకు వెళ్లిపోవటం మరింత చిత్రంగా జరిగిపోయింది. అదెలాగంటే...ఎనిమిది లక్షల షేర్లతో సత్యంలోకి ప్రవేశించి... ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీని రాజు బాధ్యతల కన్నా తన షేర్లు అమ్ముకుని బయటపడటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారన్నది అప్పటి కథనాలను చూస్తే తేలిగ్గానే అర్థమవుతుంది. ఎందుకంటే అప్పట్లో కేతన్ పరేఖ్ మోహించి వలచిన కె-10 షేర్లలో సత్యం ఒకటి. 1999 ఏప్రిల్లో శ్రీనిరాజుకు షేర్లు రాగా... కేతన్ మాయాజాలం ఆరంభమైంది కూడా అప్పుడే. ఇంకేముంది!! మరుసటేడాది మార్చికల్లా సత్యం షేరు సగటున రూ.7,200కు వెళ్లింది.

ఆ సమయంలోనే శ్రీని రాజు తన షేర్లన్నీ అమ్మేసుకుని కంపెనీనుంచి బయటపడ్డారు. 2000వ సంవత్సరంలోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి... డెరైక్టర్‌గా మాత్రం మరో రెండేళ్లు కొనసాగారు. సత్యం ఖాతాల కుంభకోణానికి బీజం పడటం... విదేశీ ఖాతాల్లోకి డబ్బులు తరలించటం... పనికిరాని కంపెనీలను భారీ మొత్తాలకు కొనుగోళ్లు చేయటం... ఇలా నిజమైన ఇన్వెస్టర్ల సొమ్మును దిగమింగటం జరిగింది ప్రధానంగా ఆ మూడేళ్లలోనే కావటం గమనార్హం. సత్యంలో కీలక పదవిలో ఉన్న శ్రీని రాజు వీటిని బయట పెట్టడమో, ఇన్వెస్టర్లను అప్రమత్తం చేయటమో కాకుండా... దీన్నొక అవకాశంగా మలచుకుని తనకు రైట్స్ రూపంలో దక్కిన 8 లక్షల షేర్లను రూ.550 కోట్ల పైచిలుకు మొత్తానికి అమ్ముకుని సత్యంకు గుడ్‌బై చెప్పేయటమే అసలు విచిత్రం. (ఇం తకుమునుపు సాక్షి కథనాల్లో శీని రాజుకు ఈ డీల్‌లో 2,400 కోట్లు వచ్చినట్లు ప్రచురితమైంది. అది పొరపాటు గమనించగలరు.)

అసలు సత్యంలో కీలక పదవిలో ఉంటూ... సత్యం కంప్యూటర్స్ కీర్తి ప్రతిష్టలు దేశదేశాలా మారు మోగుతున్న సమయంలో... రామలింగరాజు తోడల్లుడిగా కంపెనీలో తన హవా విపరీతంగా నడుస్తున్న సమయంలో శ్రీని రాజు కంపెనీ నుంచి ఎందుకు బయటపడ్డారు? ఈ ప్రశ్నకు ఇప్పటి దాకా సమాధానం లేదు. దీనిపై గతంలోనే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వెలువ డగా శ్రీనిరాజు మాత్రం మౌనంగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చారు. ఎందుకంటే సత్యంలో అక్రమాలు జరుగుతున్నాయని, నిధులు బయటకు తరలిపోతున్నాయని, షేర్ హోల్డర్లు మునిగిపోక తప్పదని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హోదాలో ఉన్న శ్రీని రాజుకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టే కృత్రిమంగా షేరు విలువ పెరుగుతున్న క్రమంలో దాన్నుంచి లబ్ధి పొందటానికి ప్రయత్నించారు తప్ప దాన్ని నియంత్రించటమో, బయటపెట్టి ఇన్వెస్టర్లను అప్రమత్తపరచటమో చేయలేదు.

అక్కడి నుంచి అర్జెంటుగా బయటపడ్డాక చింతలపాటి హోల్డింగ్స్‌ను ఏర్పాటు చేసి తద్వారా మీడియాలోకి, రియల్టీలోకి, ఇతరత్రా రంగాల్లోకి విస్తరిస్తూ పోయారు తప్ప సత్యంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ డబ్బుతోనే బడా పెట్టుబడిదారుగా మారారు. వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తూ... 20కి పైగా కంపెనీల్లో డెరైక్టరయ్యారు. పదకొండేళ్ల కిందటే రూ.550 కోట్ల పైచిలుకు మొత్తంతో సత్యం నుంచి బయటపడ్డ శ్రీనిరాజు ఆర్థిక సామ్రాజ్యం విలువ ప్రస్తుతం కొన్ని వేల కోట్ల రూపాయల పైమాటే. హైటెక్ సిటీ పక్కన ఐల్యాబ్స్ పేరిట నిర్మించి... అంతర్జాతీయ కంపెనీలకు లీజుకిచ్చిన భారీ భవంతి విలువే కొన్ని వందల కోట్లు దాటుతుంది. ఇక... వేల ఎకరాల శ్రీసిటీ సెజ్‌తో పాటు మిగతా కంపెనీల పేరిట, ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న ఆస్తులకు లెక్కే లేదు. మరి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై రెండున్నరేళ్లుగా విచారణ జరుపుతున్న సంస్థలు దానికి ఆద్యుల్లో ఒకరైన వ్యక్తిపై దృష్టి పెట్టలేదెందుకు?

ఎవరికి పుట్టిన బిడ్డలు?

సత్యం సంస్థను నిలువునా ముంచటంలో తన పాత్రను విజయవంతంగా పోషించి, శ్రీనిరాజు అడ్డంగా సంపాదించిన సొమ్ములో కొంత వెచ్చించగా పుట్టిన బిడ్డల్లో టీవీ9 ఒకటి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన హితులు, సన్నిహితులు, బంధువులతో ముందుగా చుట్టూ భూములు కొనిపించి తదుపరి ప్రకటించిన హైటెక్ సిటీలో ఈ శ్రీని రాజుకు చెందిన ఐ-ల్యాబ్స్‌కు తొలివిడతలో ఆరెకరాల భూమి లభించింది. భూమి ధరలో రాయితీలు తదితరాలు శ్రీని రాజు సంస్థలకు దక్కిన వాటిలో అదనం. సత్యం సంస్థనుంచి నిధులు మాయం కావటం... మొత్తంగా సత్యం సంస్థలో ఆర్థిక కుంభకోణం జరిగినది 1999 నుంచి 2002 మధ్య మాత్రమే అన్నది సీబీఐ దర్యాప్తులో వెల్లడవుతోంది. ఈ నిజం వెల్లడయినదీ జాతీయ దినపత్రికలు నివేదించినది 2010లో మాత్రమే.

ఇక్కడే మరో ముఖ్యాంశాన్ని ప్రస్తావించాలి. వైఎస్ హయాంలో పారిశ్రామిక సంస్థలు, సెజ్‌లు వంటి వాటికి అనుమతులు, ఆమోదాలివ్వటం... భూముల సేకరణకు అనుమతించటం వంటి వాటి ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్నది ఎల్లో సిండికేట్ చేస్తున్న ప్రచారం. ఇప్పుడు వారికి తందాన అంటూ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలమీద, ఆస్తుల మీద, వ్యక్తిగతంగా ఆయనమీద అసత్య ప్రచారాన్ని ఉద్యమ స్థాయికి తీసుకువెళ్ళిన టీవీ9... నిజంగా వైఎస్ ముడుపులు పుచ్చుకునే మనిషే అయితే, తాము తడ సమీపంలోని శ్రీసిటీ సెజ్ అనుమతుల కోసం ఎంత సొమ్మును లంచంగా ఇచ్చారో నివేదిం చాలి. అదీకాక, శ్రీసిటీకి సంబంధించిన అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మినహాయించిందనే అభిప్రాయం కూడా వినిపించింది. ఇలా నిబంధనలు మినహాయించటానికి మరెంత సొమ్మును ఎవరికి ముట్టచెప్పారో ప్రజల ముందకు వచ్చి ధైర్యంగా చెప్పవచ్చు. లేదంటే, తమవద్ద ఒక్క పైసా సొమ్ము తీసుకోని వైఎస్‌మీద ఎల్లో మీడియా తన రాజకీయ వ్యూహంలో భాగంగా సాగిస్తున్న దిగజారుడు నాటకంలో ఇప్పుడు ఎందుకు భాగస్వామి అయిందో దానికైనా జవాబు ఇవ్వగలగాలి.

పనిలో పనిగా... రవిప్రకాశ్ అనే ఒకప్పటి రూ. 3,000 సుప్రభాతం ఉద్యోగి ఇంతలోనే వందల కోట్ల రూపాయల మేర కంపెనీల్లో షేర్లతోపాటు ఏకంగా 14 కంపెనీలకు ఎలా డెరైక్టరు కాగలిగాడన్న ప్రశ్నకు సమాధానం రావాలి. ఆఫ్రికాలో కల్లోలానికి మారుపేరైన ఉగాండా వంటి దేశాల్లో లక్షల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్టు చూపి అక్కడ ఏం చేస్తున్నదీ వివరించాలి. సయీఫ్-3 అనే మారిషస్ ఆధారిత సంస్థకు టీవీ9 యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ 15 శాతం వాటాలు అమ్మాలనుకుంటోందన్న వార్తలు వెలువడ్డాయి. ఇంతకీ ఈ సయీఫ్-3 ఎవరి సంస్థ? మారిషస్ పెట్టుబడులంటేనే ఏదో అక్రమం అన్నట్టు గతంలో ప్రచారం చేసిన టీవీ9 ఇప్పుడు తనకు వచ్చే పెట్టుబడుల అసలు యజమాని ఎవరో వెల్లడించగలదా?

ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అధికారంలో ఉన్నవారి వైఫల్యాలమీద ప్రధాన చర్చ సాగుతుంది. ప్రజల సమస్యలమీద మీడియా స్పందిస్తుంది. ప్రభుత్వానికి తానూ ప్రతిపక్షంగా నిలబడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావటమన్నదే ఏకైక లక్ష్యంగా ఇక్కడి ఎల్లో సిండికేట్ ప్రజల సమస్యల్ని ఎందకు గాలికి వదిలేస్తోంది? వైఎస్ జగన్ లక్ష్యంగా అబద్ధాలను కూడా ఎందకు ప్రసారం చేస్తోంది? వైఎస్ జగన్ ఇటు అధికారంలోగానీ, అటు ప్రధాన ప్రతిపక్షంలోగానీ లేరే! అయినా ఎందుకు బెంబేలెత్తుతోంది. చంద్రబాబు అనే చిన్నగీతను సాగదీయటం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చి, వైఎస్ అనే ప్రజల్లో ఉన్న పెద్దగీతను చెరపటానికి ఎందుకింతగా దిగజారిపోతోంది? వీరి చేతుల్లో ఉన్న మీడియా వల్ల రాష్ట్ర ప్రజలకు ఒనగూడిన ప్రయోజనం ఎంత? దాన్ని అడ్డం పెట్టుకుని ముగ్గురు ఆర్‌లు సంపాదించుకున్నది ఎంత? ఎవరి హితం కోసం వీరి జర్నలిజం? ఏ నిజాలు చెప్పటం వీరి ఇజం? 

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...